
అర్జెంట్ పనుందని ఆఫీసుకొచ్చారు... తీరా చూస్తే మీరు చేయాల్సిన పనికి అవసరమైన డాక్యుమెంట్లన్నీ ఇంట్లోని పీసీలోనే ఉండిపోయాయని తెలిసింది. ఏం చేస్తారు? ఏముంది... ఉసూరుమనుకుంటూ ఇంటికైనా వెళతాను.. లేదంటే పని వాయిదా వేసుకుంటాను అంటున్నారా? ఆ అవసరం లేదిప్పుడు. చేతిలో స్మార్ట్‌ఫోన్ ఉంటే... ఇంట్లోని పీసీలోని డాక్యుమెంట్లకూ రెక్కలొస్తాయి! అదెలాగో చూడండి...
ప్రపంచంలోని ఏ మూల నుంచైనా మీ ఇంట్లోని పీసీని తెరిచేందుకు ప్రస్తుతం అనేక మార్గాలు అందుబాటులో ఉన్నాయి. ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్స్‌తో పనిచేసే స్మార్ట్‌ఫోన్‌తో ఈ పనిచేసేందుకు రెండు మార్గాలున్నాయి... ఒకటేమో క్లౌడ్ టెక్నాలజీతో పనిచేస్తుంది. రెండోది ఆండ్రాయిడ్ అప్లికేషన్‌తో. ముందుగా క్లౌడ్ టెక్నాలజీ సంగతి చూద్దాం...
ముందుగా ఇంటర్నెట్ సదుపాయం ఉన్న మీ పీసీలో ఒక సాఫ్ట్‌వేర్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. www.dropbox. com వెబ్‌సైట్‌లోకి వెళ్లి మీ పేరుతో ఓ అకౌంట్‌ను ఓపెన్ చేసుకోవాలి. ఉచితంగా లభించే ఈ సాఫ్ట్‌వేర్‌ను డౌన్‌లోడ్ చేసుకున్న తరువాత అకౌంట్‌లోకి లాగిన్ అయ్యి ఒక కొత్త ఫోల్డర్‌ను ఓపెన్ చేసుకోవాలి. షేర్ చేసుకోవాల్సిన డాక్యుమెంట్‌లను అందులో పడేస్తే.. పీసీతో మీ పని అయిపోయినట్లే. ఇక ఆండ్రాయిడ్ మార్కెట్‌లో లభించే డ్రాప్‌బాక్స్ సాఫ్ట్‌వేర్ అప్లికేషన్‌ను డౌన్‌లోడ్ చేసుకుంటే సరిపోతుంది. ఆ తరువాత మీరు అప్పటికే ఓపెన్ చేసిన అకౌంట్‌లోకి లాగినై కావాల్సిన డాక్యుమెంట్‌ను స్మార్ట్‌ఫోన్‌లోకి లాక్కోవడమే తరువాయి.
టీమ్ వ్యూయర్‌తోనూ...
ఇది కూడా ఇంటర్నెట్‌లో ఉచితంగా లభించే సాఫ్ట్‌వేర్. విండోస్, లైనక్స్, మ్యాక్ వంటి భిన్న ప్లాట్‌ఫార్మ్‌లపై పనిచేస్తుంది. ఇందుకోసం www.teamviewer.com వెబ్‌సైట్‌లోకి ప్రవేశించి పీసీపై, ఆప్స్ మార్కెట్ నుంచి స్మార్ట్‌ఫోన్, ట్యాబ్లెట్‌లోకి సాఫ్ట్‌వేర్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఆ తరువాత మీ పీసీకి ప్రత్యేకమైన యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌ను ఏర్పాటు చేసుకుంటే... దాంట్లోని డాక్యుమెంట్లను స్మార్ట్‌ఫోన్ అప్లికేషన్ ద్వారా కావాల్సినప్పుడు ఎక్కడ కావాలంటే అక్కడ చూసుకోవచ్చు. మార్పులు, చేర్పులు చేసుకోవచ్చు కూడా.
No comments:
Post a Comment