ఏడాది గడచిపోయింది.... కోటి ఆశలతో కొత్త సంవత్సరానికి స్వాగతం పలికాం!
కాలగర్భంలో కలిసిపోయిన 2011లో మనిషి ఎన్నో అద్భుతాలు సృష్టించాడు...
ప్రతి పరమాణువుకూ ద్రవ్యరాశినిచ్చే హిగ్స్ బోసాన్ ఉనికిని దాదాపు నిర్ధారించాడు..
నిన్నమొన్నటిదాకా మిథ్యేననుకున్న భూమిలాంటి గ్రహాల ఉనికినీ గుర్తించాడు...
మరి ఏడాది శాస్త్ర, సాంకేతిక రంగాల్లో రాగల అద్భుతాలేమిటి? కొన్నేళ్లుగా
జరుగుతున్న పరిశోధనలను దృష్టిలో ఉంచుకుంటూ 2012 టెక్ ప్రభంజనాలేమిటో ఇట్టే
అర్థమవుతాయి. ఆ వివరాలు... 
ఒక్క
విషయం మాత్రం స్పష్టం. ఈ ఏడాది స్విట్జర్లాండ్, ఫ్రాన్స్ సరిహద్దుల్లోని
యూరోపియన్ ఆర్గనైజేషన్ ఫర్ న్యూక్లియర్ రీసెర్చ్‌లో జరిగే ప్రయోగాలతో అయిదు
దశాబ్దాలుగా శాస్త్రవేత్తలను ఊరిస్తూ వచ్చిన హిగ్స్ బోసాన్‌పై స్పష్టత
రావడం ఖాయం. శీతాకాలం ముగిసిన తరువాత ఈ ఏడాది మార్చిలో లార్జ్‌హాడ్రాన్
కొలైడర్‌లో ప్రయోగాలు మళ్లీ మొదలవుతాయి. ఇప్పటికే హిగ్స్ బోసాన్ ఉండే
అవకాశమున్న ద్రవ్యరాశి పరిధిని అంచనా వేయడం, ఈ ఏడాది జరిగే ప్రయోగాల్లో
మునుపటికంటే నాలుగురెట్లు ఎక్కువ సమాచారం అందుబాటులోకి రానుండటం తదితర
అంశాలను పరిగణలోకి తీసుకుంటే ఏడాది ముగిసేసరికల్లా హిగ్స్ పజిల్
పరిష్కారమవుతుందని శాస్త్రవేత్తలు ధీమాగా ఉన్నారు.
గత ఏడాది
మాదిరిగానే 2012లోనూ సౌర కుటుంబానికి ఆవల మరిన్ని గ్రహాలను
(ఎక్సోప్లానెట్లు) గుర్తించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. నాసా ప్రయోగించిన
కెప్లర్ అంతరిక్ష నౌక ఇప్పటి వరకూ దాదాపు 2,326 ఎక్సోప్లానెట్లను
గుర్తించగా వీటిల్లో భూమిని పోలిన వాతావరణమున్నవి మూడు ఉన్నట్లు అంచనా
వేస్తున్నారు. కెప్లర్ సేకరించిన సమాచారాన్ని విశ్లేషించడం ద్వారా మరిన్ని
గ్రహాలు... వాటిల్లో భూమిని పోలేవి ఉండే అవకాశం లేకపోలేదని అంచనా.
గ్రాఫీన్
హవా... కంప్యూటర్ మైక్రోప్రాసెసర్ పేరుచెప్పగానే గుర్తుకొచ్చేది సిలికాన్!
యాభై ఏళ్లుగా కంప్యూటర్ రంగానికి మూలస్తంభంగా నిలిచిన ఈ అర్ధవాహక పదార్థం
(సెమీ కండక్టర్) తన ఆధిపత్యాన్ని వదులుకోవాల్సిన సమయం అసన్నమైందని
అంటున్నారు శాస్త్రవేత్తలు. గత ఏడాది తొలిసారి గ్రాఫీన్‌తో ఒక
మైక్రోప్రాసెసర్ తయారవడాన్ని దీనికి కారణంగా చూపుతున్నారు. అంతేకాదు...
గ్రాఫీన్‌కు ఉన్న అద్భుత లక్షణాలను విస్తత వాడకంలోకి తెచ్చేందుకు
జరుగుతున్న ప్రయత్నాలూ ఈ ఏడాది ఒక కొలిక్కి రానున్నాయి. మడిచివేసేయగల
ఎలక్ట్రానిక్ పరికరాల గురించి చాలాకాలంగా వింటున్నప్పటికీ గ్రాఫీన్ పుణ్యమా
అని ఈ ఏడాది అవి నిజరూపం దాల్చే అవకాశముంది. గ్రాఫీన్ మాత్రమే కాకుండా....
ధ్వని, కాంతులతో చమక్కులు చేయగల మెటామెటీరియల్స్ కూడా ఈ ఏడాది కొన్ని
అద్భుతాలను సష్టించనున్నాయి. వీటితో వస్తువులను అదశ్యం చేయగల సామర్థ్యాన్ని
అందుకోవడం మనిషి లక్ష్యమైనప్పటికీ అది సాకారమయ్యేలోపు... ఇతర రంగాల్లో
వీటిని వాడుకునే వీలుంది.మెటామెటీరియల్స్‌తో సష్టించే లేజర్లను
కంప్యూటర్లను మరింత వేగంగా నడిపించేందుకు వీటిని ఉపయోగించాలని ప్రయత్నాలు
జరుగుతున్నాయి.
అంగారకుడి గుట్టు వీడేనా?సౌరకుటుంబంలో
శాస్త్రవేత్తలకు బాగా ఆసక్తి ఉన్న గ్రహమేదైనా ఉందీ అంటే అది అంగారకుడే.
ఒకప్పుడు నీరు ఉండేదన్న విషయం రూఢి అయిన తరువాత ఇది మరింత పెరిగింది ఇందులో
భాగంగానే గత ఏడాది ప్రయోగించిన మార్స్ సైన్స్ లాబొరేటరీ అరుణగ్రహంవైపు
దూసుకెళుతోంది. మార్చి ఆరవతేదీకల్లా అక్కడికి చేరుకుంటుంది కూడా. ఆ గ్రహం
మధ్య రేఖ (భూమధ్య రేఖ వంటిది) సమీపంలోని 150 చదరపు కిలోమీటర్ల
విస్తీర్ణంలోని లోయలో ఈ వ్యోమనౌక ఈ ఏడాది చేపట్టే ప్రయోగాలు ఎన్నో
ఆసక్తికరమైన అంశాలను వెలుగులోకి తెచ్చే అవకాశముంది. ఆ గ్రహంపై ఒకప్పుడైనా
జీవం ఉందా? ఇప్పటి పరిస్థితి ఏమిటి? అక్కడి నేలలోని రసాయన కూర్పు ఏమిటి?
తదితర ఆసక్తికరమైన ప్రశ్నలకు జవాబు దొరుకుతుందేమో వేచి చూడాలి.
మొబైల్ ఫోనే క్రెడిట్‌కార్డు...
ఈ
విషయం మనం చాలాకాలంగా వింటున్నదే. కాకపోతే ఈ ఏడాది ఇది సాకారమయ్యే
అవకాశాలు ఎక్కువయ్యాయి. ‘ది కామన్వెల్త్ బ్యాంక్’ తొలిసారి 2011 డిసెంబరులో
ఐఫోన్లలో ఉపయోగించే ‘కచింగ్’ అప్లికేషన్ ద్వారా క్రెడిట్ కార్డు
చెల్లింపులకు శ్రీకారం చుట్టింది కూడా. ఇందులో భాగంగా వినియోగదారులు
ఐకార్టే ఐఫోన్-4 కేస్‌ను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఈ కేస్‌లోనే
క్రెడిట్‌కార్డు వివరాలు ఉంటాయన్నమాట. నియర్‌ఫీల్డ్ కమ్యూనికేషన్
(ఎన్‌ఎఫ్‌సీ) అనే టెక్నాలజీ ఆధారంగా ఇది పనిచేస్తుంది. ఈ టెక్నాలజీ ఉన్న
మొబైల్‌ఫోన్‌ను క్రెడిట్‌కార్డు రీడర్ వద్ద ఉంచితే మీ అకౌంట్ నుంచి
చెల్లింపులు జరుగుతాయన్నమాట. 2013 నాటికల్లా ప్రతి 5 మొబైళ్లలో ఒకదాంట్లో
ఎన్‌ఎఫ్‌సీ టెక్నాలజీ ఉంటుందని అంచనా. ది కామన్వెల్త్ బ్యాంక్ ద్వారా
మాస్టర్‌కార్డ్ పేపాస్ సర్వీసులు అందుకోవచ్చు. గూగుల్, వీసా కంపెనీలు
‘వాలెట్’ పేర్లతో అమెరికన్ ఎక్స్‌ప్రెస్ ‘సెర్వ్’ పేరుతో మొబైల్‌ఫోన్
క్రెడిట్‌కార్డులను అందుబాటులోకి తేనున్నాయి.
మైక్రోప్రాసెసర్లలో కొత్త విప్లవం...ఇప్పటివరకూ
మనం డ్యుయల్‌కోర్, మల్టీకోర్ మైక్రోప్రాసెసర్ల గురించి మాత్రమే విన్నాం. ఈ
ఏడాది తొలిసారి త్రీడీ చిప్‌లు అందుబాటులోకి రానున్నాయి. అంతేకాదు...
తొలిసారిగా టాబ్లెట్లలో క్వాడ్‌కోర్ (నాలుగు భాగాలున్నది) మైక్రోప్రాసెసర్ల
వాడకానికి రంగం సిద్ధమైంది. ఎన్‌విడియా ‘కాల్ -ఈ’ పేరుతో అభివద్ధి
చేస్తున్న ఈ క్వాడ్‌కోర్ ప్రాసెసర్ టాబ్లెట్లను ల్యాప్‌టాప్‌లతో సమానంగా
నిలబెడుతుందని అంచనా. ఇదిలా ఉండగా గత ఏడాది ప్రముఖ టెక్నాలజీ సంస్థ త్రీఎం
సిలికాన్ పొరలను ఒకదానిపై ఒకటి పేర్చి అతికించేందుకు అవసరమైన జిగురును
అభివద్ధి చేసిన నేపథ్యంతో ఇకపై మైక్రోప్రాసెసర్లు త్రీడీగా మారనున్నాయి.
కదలికలతోనే నియంత్రణ...మైక్రోసాఫ్ట్
కైనిక్ట్ గురించి విన్నారా? మన కదలికలను గుర్తించి తదనుగుణంగా పనిచేసే
అద్భుత గేమింగ్ పరికరమిది. సోని, నిన్‌టెండో వంటి కంపెనీలు కూడా ఇటువంటి
మోషన్ సెన్సర్ పరికరాలను మార్కెట్‌లోకి ప్రవేశపెట్టినప్పటికీ కైనిక్ట్ బాగా
ప్రాచుర్యంలోకి వచ్చింది. కైనిక్ట్ స్ఫూర్తిగా కొన్ని కంపెనీలు చేస్తున్న
ప్రయత్నాలు ఫలిస్తే ఈ ఏడాది తొలిసారిగా కేవలం చేతి కదలికలు, సంజ్ఞల ద్వారా
టీవీ, పీసీ వంటి ఎలక్ట్రానిక్ పరికరాలను నియంత్రించే పరిజ్ఞానం మనకు
అందుబాటులోకి వచ్చినట్లే.
- గిళియార్ గోపాలకృష్ణ మయ్యా
No comments:
Post a Comment