Friday, July 6, 2012

మూలకణాలే బ్రహ్మా స్త్రాలు!

మూలకణాలే బ్రహ్మా స్త్రాలు!
నిన్నటిదాకా మన ముందు నిక్షేపంగా తిరిగిన వారు ఒక్క రోడ్డు ప్రమాదంతో వెన్ను విరిగి కూలబడిపోతారు రాయిలాంటి మనిషి హఠాత్తుగా గుండెపోటుతో కుప్పకూలుతారు మందుబిళ్ల మింగి ఎరగనివారు క్యాన్సర్ మహమ్మారికి బలై పోతారు చెట్టంత మనిషిని అల్జీమర్స్ పీల్చి పిప్పి చేసేస్తుంది మధుమేహం జీవితాంతం వెంటాడే నీడైపోతుంది మరి.. ఈ ఉపద్రవాలన్నింటి నుంచి మనల్ని మనం పూర్తిగా కాపాడుకోలేమా? అందుకు ఒక్కటే సమాధానం... మూలకణాలతో చికిత్స!

హైటెక్ యుగంలో వైద్య విజ్ఞానం కొత్త పుంతలు తొక్కుతున్న రోజులివి. ప్రాణాంతక వ్యాధులన్నింటినీ అరికట్టేందుకు ఎప్పటికప్పుడు శాస్త్రవేత్తలు విస్తృత పరిశోధనలు కొనసాగిస్తున్నారు. రకరకాల చికిత్సా పద్ధతులు కనుగొంటున్నారు. అయినా, ఇంకా అనేక వ్యాధులకు సమర్థ చికిత్సలే అందుబాటులో లేవు. అయితే నఖశిఖ పర్యంతం.. తల వెంట్రుకల నుంచి కాలిగోటి దాకా ఏ అవయవానికి వచ్చే వ్యాధికైనా సరే.. మూలకణాలే బ్రహ్మాస్త్రాలుగా మారబోతున్నాయి! సర్వరోగాలనూ మూలాలతో సహా పెకలించబోతున్నాయి!!

ఏడేళ్ల తర్వాత చూపొచ్చింది!
అమెరికాకు చెందిన స్టీవెన్స్‌కు ఏడేళ్ల క్రితం శ్వాస సంబంధమైన న్యుమోనియా వచ్చింది. అది తీవ్రమై చివరికి ప్రాణాలకే ప్రమాదం ఏర్పడింది. అప్పటికి ఎలాగోలా బతికి బట్టకట్టాడు. కాని నేత్రనాడికి రక్త సరఫరా తగ్గడంతో కంటిచూపును పూర్తిగా కోల్పోయాడు. అయితే ఏడేళ్ల తర్వాత అతడు మళ్లీ చూడగలిగాడు. ప్రపంచ వైద్యరంగంలోనే అరుదైన ఈ అద్భుతాన్ని ఉత్తరాఖండ్‌లోని రుద్రపూర్ లో గల ‘ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్పైనల్ ఇంజ్యురీ అండ్ స్టెమ్‌సెల్ రీసెర్చ్’కు చెందిన వైద్యుడు హిమాంశు బన్సాల్ సాధ్యం చేసి చూపించారు. మూలకణాల(స్టెమ్‌సెల్స్) చికిత్సతో చేయగలిగే అద్భుతాలకు ఇది ఒక ఉదాహరణ మాత్రమే.

గుండెపోటు తర్వాత బలహీనమయ్యే గుండెను మూలకణాల చికిత్సతో తిరిగి బలోపేతం చేయడంలో ఆస్ట్రేలియాలోని ఓ కంపెనీ శాస్త్రవేత్తలు తొలిదశ విజయం సాధించారు. బ్రిటన్‌లోని ‘రిన్యూరాన్’, ఇతర కంపెనీల పరిశోధకులు పిండ మూలకణాలతో పక్షవాతానికి చెక్ పెట్టే పనిలో ఉన్నారు. ప్రపంచంలోనే తొలిసారిగా వెన్నెముక గాయాలకు పిండ మూలకణాలతో చికిత్స చేసిన ‘జెరాన్’ కంపెనీ కూడా ఈ యజ్ఞంలో పాలు పంచుకుంటోంది. ధూమపానం వల్ల పాడైన ఊపిరితిత్తుల శ్వాస గోణులను మూలకణాలతో పునరుత్పత్తి చేయడంలో ‘జినోమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సింగపూర్’ శాస్త్రవేత్తలు సఫలమయ్యారు. వీటితోపాటు గుండెజబ్బు, మధుమేహం, ఎముకమజ్జ మార్పిడి, క్యాన్సర్, పార్కిన్సన్స్(అవయవాల వణుకు), మెదడు కణాల పునరుత్పత్తి, రక్తంలోని ప్లేట్‌లెట్‌ల తయారీ ఒకటేమిటి.. అన్ని రోగాలకూ మూలకణాలతో చికిత్స చేసేందుకు ప్రస్తుతం విస్తృత పరిశోధనలు సాగుతున్నాయి.

మూలకణాలు అంటే...
మనిషితోపాటు అన్ని జంతువులు, బహుకణ జీవుల్లో ప్రతి అవయవమూ, కణజాలమూ ఏర్పడే ది మూలకణాలతోనే. వీటికి శరీరంలోని ఏ అవయవ కణాలుగానైనా మారగలిగే సామర్థ్యం ఉంటుంది. అంటే అన్ని అవయవాలనూ ఇవి తయారు చేయగలవన్నమాట. ఇవి రెండు రకాలు. పిండ మూలకణాలు, ప్రౌఢ మూలకణాలు. పిండాభివృద్ధి దశలో బ్లాస్టోసిస్ట్ నుంచి వేరుపడే కణాలు పిండ మూలకణాలు కాగా, వివిధ అవయవాల కణ జాలాల్లో ఉండేవి అడల్ట్ స్టెమ్‌సెల్స్ (ప్రౌఢ మూలకణాలు). పిండాభివృద్ధి ప్రక్రియలో భాగంగా పిండ మూలకణాలు వివిధ రకాల ప్రత్యేక అవయవ కణాలుగా విభజన చెందుతాయి. తద్వారా రక్తం, చర్మం, కణజాలం వంటివన్నీ తయారవుతాయి.

వీటితో చికిత్స ఇలా...
రకరకాల వ్యాధులు, సమస్యల కారణంగా వివిధ అవయవాల్లో ఏర్పడే లోపాలను మూలకణాలతో సరిచేస్తారు లేదా ఆ అవయవాలను పునరుత్పత్తి చేస్తారు. ఉదాహరణకు గుండెపోటు వచ్చిన ప్రతిసారీ గుండె కణాలు దెబ్బతిని గుండె బలహీనమైపోతుంది. గుండెకణాలను తిరిగి పునరుత్పత్తి చేయాలన్నా లేదా వాటిని కృత్రిమంగా తయారుచేసి గుండెకు అందించాలన్నా మూలకణాలతోనే సాధ్యమవుతుంది. అమెరికాలోని లూయిస్ విల్లీ వర్సిటీ పరిశోధకులు ఈ ప్రక్రియలో విజయం సాధించారు.

వెన్నెముక గాయాలైన వారిలో కీలకమైన నాడీవ్యవస్థ స్పందన కోల్పోతుంది. అలాంటి సందర్భాల్లో మూలకణాల ద్వారా ఉత్పత్తి చేసిన నాడీకణాలను వెన్నెముకలోకి చొప్పించి శరీరంలో కదలికలు తీసుకురావడం వీలవుతుంది. వెన్నెముక చీలిన ఎలుకలకు ఇటీవల ఈ చికిత్స చేసిన జపాన్ శాస్త్రవేత్తలు వాటిలో కదలికలు తీసుకు వచ్చారు కూడా. తొలిసారిగా అతి సమర్థమైన పిండ మూలకణాలను తయారుచేసిన బ్రిటన్ శాస్త్రవేత్తలు వాటిని 2014లోగా చికిత్సకు సిద్ధం చేయనున్నారు. అయితే వీరితోపాటు ఇంకా అనేకమంది చేస్తున్న పరిశోధనలు సమీప భవిష్యత్తులోనే తుది దశకు చేరుకోనున్నాయి. త్వరలోనే పదుల సంఖ్యలో మూలకణ చికిత్సలు అందుబాటులోకి రానున్నాయి.

మెదడులో అవయవాలు మొలిపించాడు!
పిండం నుంచి సేకరించిన మూలకణాలను పార్కిన్సన్స్ వ్యాధితో బాధపడుతున్న ఓ వ్యక్తిలోకి చొప్పించాడో వైద్యుడు. కొంతకాలానికి ఆ రోగి చనిపోయాడు. అయితే అతడి మెదడులో చర్మం, మృదులాస్థి, ఎముకల వంటి అవయవాలు పెరిగి పరస్పరం అతుక్కుపోయి ఉండటాన్ని చూసి శవపరీక్షలు చేసిన వైద్యులు బిత్తరపోయారు. ఆ చనిపోయిన వ్యక్తి మాక్స్ ట్రుయెక్స్ అనే మాజీ ఒలింపిక్ రన్నర్. పదిహేనేళ్ల క్రితం జరిగిన ఆ సంఘటన పెను సంచలనమైపోయింది.

ఇవీ మూలాలు...
పలు వ్యాధులకు మూలకణాలతో సమర్థ చికిత్స చేయవచ్చని తొలిసారిగా యూనివర్సిటీ ఆఫ్ టొరాంటోకు చెందిన శాస్త్రవేత్తలు ఎర్నెస్ట్ ఎ.మెక్లాక్, జేమ్స్ ఇ.టిల్ 1960లలో ప్రతిపాదించారు. ఎముక మజ్జ, బొడ్డుతాడు రక్తం నుంచి సేకరించిన మూలకణాలను అభివృద్ధిపర్చి వివిధ చికిత్సలకు ఉపయోగించవచ్చని వారు తెలిపారు. ఆ తర్వాత మూలకణాల చికిత్సపై దృష్టిపెట్టిన శాస్త్రవేత్తలు మెదడులో అవయవాలు మొలిపించిన ఉదంతం మొదలుకొని ఎన్నో అడ్డంకులు, అవరోధాలను ఎదుర్కొంటూ ఎట్టకేలకు పరిశోధనలను ఓ కొలిక్కి తీసుకువచ్చారు.
- హన్మిరెడ్డి యెద్దుల

మూలకణాలతో కృత్రిమ అవయవాలు అభివృద్ధికి కృషి
భారతదేశంలో మూలకణ పరిశోధనల పరిస్థితి ఏంటి?
పిండమూల కణాలకు సంబంధించి దేశంలో అనేక సంస్థలు పరిశోధనలు చేస్తున్నాయి. కేంద్ర శాస్త్ర, సాంకేతిక మంత్రిత్వశాఖ సీఎస్‌ఐఆర్, డిపార్ట్‌మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ, ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ వంటి సంస్థలు కూడా మూలకణాల వైద్యంలో విధివిధానాల అభివృద్ధికి నిధులు అందజేస్తున్నాయి. ఇప్పటికే కాలేయం, కనుగుడ్డుపై ఉన్న శుక్లపటలానికి సంబంధించి ఈ విధానాలను విజయవంతంగా రూపొందించారు. అంతేకాకుండా పిండాధారిత, రక్త, కాలేయ, గుండె, క్లోమ గ్రంథులకు సంబంధించిన మూలకణాలపై విసృ్తతంగా పరిశోధనలు జరుగుతున్నాయి.

ఏఏ వ్యాధుల చికిత్సలో మూలకణాల ఉపయోగం ఎక్కువగా ఉండవచ్చు?
కనుగుడ్డు ఉపరితలాన్ని తయారుచేయడంలో శాస్త్రవేత్తలు ఇప్పటికే విజయం సాధించారు. రక్త సంబంధ వ్యాధుల్లో ఎముక మజ్జ ట్రాన్స్‌ప్లాంటేషన్‌లోనూ, నాడీసంబంధ వ్యాధులు, గుండెపోటు విషయంలోనూ మూలకణాలు సమర్థంగా పనిచేయగలవన్న అంచనాలు ఉన్నాయి.

మూలకణ పరిశోధనల భవిష్యత్తు?
శరీరంలోని ఏ రకమైన కణంగానై అభివృద్ధి చెందగల అద్భుత లక్షణం పిండ మూలకణాల సొంతం. బొడ్డుతాడు రక్తం ద్వారా వీటిని సేకరించి భద్రపరిచేందుకు అవకాశాలున్నాయి. మరోవైపు సాధారణ కణాలకు సైతం మూలకణాల లక్షణాలను అందించే సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వస్తోంది.

మూలకణాలపై సీసీఎంబీలో జరుగుతున్న పరిశోధనలేమిటి?
సీసీఎంబీ మూలకణాలపై ఇటీవలే పరిశోధనలు చేపట్టింది. కృత్రిమ అవయవాల అభివృద్ధికి మూలకణాలను ఉపయోగించుకునే దిశగా పరిశోధనలు సాగిస్తున్నాం. సీసీఎంబీలోని నానోటెక్నాలజీ విభాగం ఇందుకు అవసరమైన నిర్మాణాల (స్కాఫోల్డ్) ను అభివృద్ధి చేస్తున్నారు.

No comments:

Post a Comment