Saturday, July 7, 2012

టాటా మోటర్స్ గాలి కారు!
ప్రపంచంలోనే అత్యంత చౌకైన కారును అభివృద్ధి చేసిన టాటా మోటార్స్ మరో సంచలనానికి సిద్ధమవుతోంది. పెట్రోలు, డీజిల్ వంటి ఇంధనాల అవసరమే లేని... కేవలం గాలితో పరుగులు పెట్టే కారు తయారీలో కీలకమైన ముందడుగు వేసింది. ఆ వివరాలు...

ఫార్ములా వన్ రేసింగ్ కార్లను డిజైన్ చేసే గైనిగర్ అనే మెకానికల్ ఇంజినీర్ ఎప్పుడో 1991లోనే ఈ గాలి కారుకు రూపకల్పన చేశారు. విపరీతమైన పీడనంతో కూడిన గాలిని ట్యాంకుల్లో నింపి... క్రమపద్ధతిలో విడుదల చేయడం ద్వారా ఇంజిన్‌ను నడపడం ఈ కారులోని ప్రత్యేకత. పీడనంతో కూడిన గాలి విడుదలైనప్పుడు పుట్టే శక్తితో కారు ముందుకు కదులుతుందన్నమాట. కారు తయారీ కోసం గై నిగర్ ‘మోటర్ డెవలప్‌మెంట్ ఇంటర్నేషనల్’ (ఎండీఐ) పేరుతో ఓ కంపెనీని స్థాపించారు. ప్రత్యేకమైన ఇంజిన్‌ను కూడా తయారుచేశారు. అయితే నమూనా కారు ఒకదాన్ని తయారుచేసినప్పటికీ వివిధ కారణాల వల్ల వాణిజ్య స్థాయిలో తయారీ మాత్రం ఇప్పటివరకూ వీలు కాలేదు.

లెసైన్స్ పొందిన టాటా మోటర్స్
అయిదేళ్ల క్రితం అంటే 2007లో టాటా మోటర్స్ ఈ గాలికారు తయారీపై ఆసక్తి కనబరిచింది. భారత్‌లో వీటిని తయారు చేసి విక్రయించేందుకు ఎండీఐ నుంచి లెసైన్స్ పొందింది. ఈ ఐదేళ్లలో కారు తయారీకి సంబంధించిన సాంకేతిక అంశాలన్నింటినీ పరిశీలించిన టాటా మోటర్స్ పీడనంతో కూడిన గాలితో నడిచే ఇంజిన్లను రెండు వాహనాల్లో విజయవంతంగా ఉపయోగించింది. ఇక ప్రాజెక్టు రెండో దశలో భాగంగా ఎండీఐతో కలిసి వాణిజ్య స్థాయిలో టెక్నాలజీ అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. అన్నీ సవ్యంగా సాగితే మరికొన్నేళ్లలోనే మన దేశ రహదారులపై గాలి కారు రివ్వు రివ్వున షికారు చేయనుంది.

గరిష్ట వేగం: గంటకు 110 కిలోమీటర్లు

పరిధి: పీడనంతో కూడిన గాలిని ఒకసారి ట్యాంకుల్లోకి నింపితే 200 కిలోమీటర్ల దూరం వరకూ ప్రయాణించవచ్చునని అంచనా.

రీజనరేటివ్ బ్రేకింగ్‌తో ఆదా: బ్రేకులు వేసినప్పుడు వృథా అయ్యే శక్తిని కూడా ఒడిసిపట్టుకునే ఏర్పాటు దీంట్లో ఉంది. ఫలితంగా దాదాపు 13 శాతం శక్తిని ఆదా చేయవచ్చు.

పీడనంతో కూడిన గాలిని రెండే రెండు నిమిషాల్లో నింపుకోవచ్చు. లేదంటే కారులోని కంప్రెషర్ సాయంతో 3.5 గంటల్లో పరిసరాల్లోని గాలినే నింపుకోవచ్చు.

పెట్రోలు, డీజిల్ వంటి ఇంధనాలేవీ వాడటం లేదు కాబట్టి ఈ కారు నుంచి వెలువడే వ్యర్థాలు కూడా ఏమీ ఉండవు. కేవలం గాలి... అది కూడా 15 డిగ్రీల సెల్సియస్ వరకూ చల్లబడి బయటకు వస్తుంది.

ఈ గాలి కారు ద్వారా ప్రయాణించడం పెట్రోలు, డీజిల్ కార్ల కంటే పదిరెట్లు చౌక అని అంచనా!

No comments:

Post a Comment