Friday, July 6, 2012

internet viseshaalu



సర్వం ‘సోషల్’ మయం!!
స్నేహం, ఆధ్యాత్మికం, సేవ, ఉద్యమం, వ్యాపారం...
అనుభవాలు, అనుభూతులు, అభిప్రాయాలు....
అభిమానాలు, ప్రేమలు, ద్వేషాలు...
విశ్లేషణలు, వ్యంగ్యాలు, వాదనలు....


సర్వం సోషల్ నెట్‌వర్కింగ్ బాట పట్టాయి. వినోదాల వారధులగా మొదలైన సోషల్ నెట్‌వర్కింగ్ సైట్‌లు సృష్టిలోని సర్వాన్ని తమ దారికి మళ్లించుకొన్నాయి. సామాన్యులు, సెలబ్రిటీలు తేడా లేకుండా ఆర్థికం, సామాజికం అనే అర్థాలు మరచి ప్రతి అంశం సోషల్ నెట్‌వర్కింగ్‌తో మిళితమయ్యాయి. ప్రస్తుతం ప్రపంచ జనాభా ఏడువందల కోట్లు అయితే అందులో 150 కోట్ల మంది నెటిజన్లు! వీరిలో కనీసం 90 శాతం మంది ట్విటర్, ఫేస్‌బుక్, లింక్డిన్, మై స్పేస్, యూట్యూబ్ లలో ఖాతాలు కలిగి ఉన్నారు. ఈ వెబ్ ప్రపంచ పంచభూతాలు దేశాలు తేడా లేకుండా సమాజాన్ని ప్రభావితం చేస్తున్న తీరు తీవ్ర స్థాయిలో ఉంది. ఈ విషయాన్ని సమాజంలోని భిన్న వర్గాలు తమ అవసరానికి తగ్గట్టుగా ఉపయోగించుకొంటున్నాయి. ట్రెండ్ సృష్టిస్తూ కొందరు, దాన్ని కొనసాగిస్తూ మరి కొందరు...అందరూ సోషల్ నెట్‌వర్కింగ్ బాట పట్టారు!

స్నేహ వారధులు...
మనిషి భావోద్వేగాలు ఇపుడు ఆన్‌లైన్‌కు ఎక్కాయి...ఈ రచ్చబండ వద్ద కొందరు దేశాన్ని, రాజకీయ నాయకులను, వ్యవస్థను, సినిమాలను, మనుషులను, అమ్మాయిలను, అబ్బాయిలను, క్రికెట్‌ను.... వేటి వేటినో తిడుతున్నారు... మరికొందరు సరిగ్గా వీటినే తలకెక్కించుకొంటున్నారు... అభిప్రాయాలను కచ్చితంగా చెప్పడానికి ఇంతకుమంచిన వేదిక ఉండదు. ఈ సెల్ఫ్ బ్రాడ్‌కాస్టింగ్ మీడియాలో మనం చెప్పిందే వేదం. నచ్చిన వాడు వింటాడు, నచ్చని వాడితో మనకు అనవసరం. ఫేస్‌బుక్, ఆర్కుట్‌లలో వ్యక్తిగత అకౌంట్ల ద్వారానే కాక కమ్యూనిటీలు, పేజ్‌ల ద్వారా మన అభిప్రాయాలను వేల, లక్షల మంది దరి చేర్చడం చాలా సులభమైంది. వాదనలూ వివాదాలే కాదు.... యువతకు కావాల్సిన హంగులన్నింటినీ ఫేస్‌బుక్ సమకూరుస్తోంది. వినోదాన్ని అందించడమే అంతిమలక్ష్యంగా పనిచేస్తున్న ఫేస్‌బుక్ నిరంతరం రూపాంతరం చెందుతూ సోషల్ మీడియాలో తన ఆధిపత్యాన్ని నిరూపించుకొంటోంది. ఇక ఫేస్‌బుక్ ధాటికి గూగుల్ వారి ఆర్కుట్ కనుమరుగయ్యే పరిస్థితుల మధ్య తన ‘గూగుల్ ప్లస్’ నైనా నిలబెట్టుకోవాలని గూగుల్ ప్రయత్నిస్తోంది. ఇలా సైట్ల మధ్య పోటీ యూజర్లకు అనేక కొత్త కొత్త సేవలను పరిచయం చేస్తోంది.

ఫేస్‌బుక్‌లో పలు కోణాలు...
కేవలం కొత్త స్నేహాలు ఏర్పరచడమే అయితే ఫేస్‌బుక్, లింక్డిన్, ఆర్కుట్‌లు ఇన్ని రోజులు మనగలిగేది కాదేమో! తన భావాన్ని రాత పూర్వకంగా చెప్పడం అనే కాన్సెప్ట్‌తో, తన ఘోషను వినడానికి అనేక మంది ఉన్నారనే భావనతో, మనోభావాలను అత్యంత ప్రభావాత్మకంగా పంచుకొనే అవకాశం ఉండటం ఫేస్‌బుక్ యువతరానికే కాక అన్ని వయసుల వారికీ ఇష్టంగా మారింది. ఇది కూడా ఫేస్‌బుక్‌లో ఒక కోణం మాత్రమే. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కనీసం వందకోట్ల వరకూ వినియోగించుకొంటున్న ఫేస్‌బుక్‌ను ఎవరి స్థాయిలో వారు, తోచిన రీతిలో ఉపయోగించుకొంటున్నారు.

ఇక్కడ ప్రచారం లాభసాటి వ్యాపారం....
సామాజిక నెట్‌వ ర్క్‌లను ఉపయోగించుకొంటూ వ్యాపార అవకాశాలను అందిపుచ్చుకొంటున్నాయి అనేక కంపెనీలు. ప్రత్యేకంగా కంపెనీలు ట్విటర్, ఫేస్‌బుక్‌లలో సందర్భానికి తగ్గట్టుగా అకౌంట్స్ క్రియేట్ చేసి వ్యాపార అవకాశాలను మెరుగుపరుచుకొంటున్నాయి.

దేశంలో పేరెన్నిక గల ’మహీంద్రా అండ్ మహీంద్రా’ తమ బ్రాండ్ పేరిట, తాము విడుదల చేసే వివిధ ఉత్పత్తుల పేరిట ఒక్కో ట్విటర్ అకౌంట్‌ను క్రియేట్ చేసి వాటి గురించి నిత్యం అప్‌డేట్స్ పంపిస్తోంది. మహీంద్రా వారి పని ఉదాహరణ మాత్రమే. కొన్ని సర్వేల ప్రకారం అంతర్జాతీయ స్థాయిలో చూసినప్పుడు 52 శాతం కంపెనీలు వినియోగదార్లకు, నెటిజన్లకు సమాచారం అందించడానికి ఫేస్‌బుక్, ట్విటర్ ఖాతాలను ప్రారంభించాయి! ఈ శాతం మనదేశంలో 64 వరకూ ఉండటం పారిశ్రామిక కంపెనీలు సోషల్ మీడియాపై ఏ స్థాయిలో ఆధారపడ్డాయో అర్థం చేసుకోవచ్చు!

సోషల్ సినిమా!
ఇక సోషల్ నెట్‌వర్కింగ్ సైట్లను వీడియో మోడ్‌లోనూ, టెక్ట్స్ మోడ్‌లోనూ ఎడాపెడా వినియోగించుకొంటున్నారు సినిమా వాళ్లు! సినిమా ఫస్ట్‌లుక్, టీజర్‌లను ఒక అకౌంట్ ద్వారా యూట్యూబ్ , ఫేస్‌బుక్‌లలోకి అప్‌లోడ్ చేస్తే చాలు...అవి లెక్క పెట్టలేని రీతిలో ఒకరి నుంచి మరొకరికి షేర్ అవుతూ ఉచిత పబ్లిసిటీని తెచ్చిపెడుతున్నాయి. అత్యంత ప్రభావితం అయిన మార్గం ద్వారా అంతే ఉచితంగా ప్రచారం లభిస్తుండటం సినిమా వాళ్లకు ఎంతో ఉపయోగకరంగా మారింది. ఇక ఐదారు నిమిషాల్లో పూర్తయ్యేలా తాము రూపొందించిన బిట్స్‌ను, సినిమాలను యూట్యూబ్, ఫేస్‌బుక్‌లలోకి అప్‌లోడ్ చేసి ఆన్‌లైన్ ద్వారా విడుదల చేసుకొంటూ తమ క్రియేటివిటినీ చాటుకొంటున్నారు అనేకమంది ఔత్సాహికులు.

ఈ మధ్య మహేశ్‌భట్ అండ్ కంపెనీ వాళ్లు ‘జిస్మ్ -2’ పేరిట ఒక ట్విటర్ అకౌంట్‌ను ప్రారంభించి దానికి లక్షల సంఖ్యలో ఫాలోవర్లను ఏర్పరుచుకొని తమ సినిమాకు సంబంధించి అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు అందిస్తున్నారు. ఆ ట్విటర్ అకౌంట్‌లో భట్ కుటుంబీకులు, జిస్మ్ రెండో భాగం గురించి వాళ్లు ఏం ప్రచురిస్తారా? అని జాతీయ మీడియా కూడా ఆసక్తితో ఎదురు చూస్తుంటుంది. ఇలా సినిమా సెలబ్రిటీ వార్తలకు బ్రేకింగ్ పాయింట్‌గా మారింది ట్విటర్.

రాజకీయ రణరంగమే!
ఇటీవలే మన ప్రధానమంత్రి కార్యాలయం ట్విటర్ అకౌంట్ ఓపెన్ చేయగా, ఏడాది కిందటే టార్గెట్ 2012 పేరుతో ఒక ట్విటర్ అకౌంట్ ప్రారంభించి రెండోసారి అధ్యక్షుడు కావాలన్న ఆశయానికి సంబంధించిన ప్రచారం ప్రారంభించాడు బరాక్ ఒబామా! భారత్‌కు సంబంధించి కామన్‌వెల్త్ క్రీడల అవినీతి, ఐపీఎల్‌లో తీవ్ర స్థాయిలో అవినీతి పేరుకొని ఉంది అనే విషయాలు బయటకు వచ్చింది కూడా ట్విటర్ ద్వారానే!

ఉద్యమాలకు కేరాఫ్!
నియంతల హస్తాల్లో నలిగిన ఆఫ్రికా దేశాల్లో చెలరేగిన ఉద్యమాల్లో సోషల్ మీడియా పాత్ర గురించి ఎంత చెప్పినా తక్కువే! ఇక మన లాంటి ప్రజాస్వామ్య దేశాల్లో కూడా ప్రభుత్వాల తీరుపై వ్యతిరేకతను అవిశ్రాంతంగా ఎగదోస్తున్నాయి సోషల్ నెట్‌వర్కింగ్ కమ్యూనిటీలు.

ప్రభుత్వాల విధానాలపైన, నాయకుల మెరిట్స్ డీమెరిట్స్‌పైనా ఫేస్‌బుక్, ఆర్కుట్ లలో లెక్కకు మంచి ఖాతాలు ఉన్నాయి. ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించే కమ్యూనిటీలు, ఫోరమ్‌లు బీభత్సమైన స్థాయిలో రెచ్చిపోతుంటాయి. వ్యక్తులను, సంస్థలను అభిమానించే పేజ్‌లకు కూడా ఆ సంస్థ స్థాయిని బట్టి మంచి ఆదరణ ఉంటుంది.

‘సాక్షి’ పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అనైతిక దాడులను వ్యతిరేకిస్తూ, ‘సపోర్ట్ సాక్షి’ పేరిట ఔత్సాహికులు ఏర్పాటు చేసిన ఫేస్‌బుక్ పేజ్‌ను లైక్ చేసే వారి సంఖ్య ప్రారంభించిన రెండు మూడు రోజుల్లోనే వేల సంఖ్యకు చేరింది. ఇక ట్విటర్‌కే పరిమితం అయిన సెలబ్రిటీలు, నాయకులు ఫేస్‌బుక్‌లో అకౌంట్లు ప్రారంభించలేదు! తాజాగా అబ్దుల్ కలాంను రాష్ట్రపతి చేయాలన్న డిమాండుతో మమతాబెనర్జీ ప్రారంభించిన ఫేస్‌బుక్ పేజ్ ను లైక్ చేసిన వారి సంఖ్య కొన్ని గంటల్లోనే వేలకు అటు నుంచి లక్షల సంఖ్యకు చేరింది.

రిక్రూట్‌మెంట్స్ త్రూ ఫేస్‌బుక్...
‘మీ స్నేహితులు ఎలాంటి వారో చెబితే, నీవెలాంటి వాడివో చె బుతా...’ పాత ఇంగ్లీషు సామెతకు అనువాదమది. ప్రస్తుతం ’మీ ఫేస్‌బుక్ అకౌంట్ చూసి మీ వ్యక్తిత్వం గురించి అంచనాకు వస్తాం’ అంటున్నాయి అనేక కంపెనీలు! ఉద్యోగం కోసం ఇంటర్వ్యూకు వెళ్లిన అభ్యర్థిని ఫేస్‌బుక్ అకౌంట్, పాస్‌వర్డ్ అడిగి అవాక్కయ్యేలా చేస్తున్నాయి అనేక కంపెనీలు! మీకు ఉద్యోగం కావాలనుకొంటే అకౌంట్ డీటైల్స్ ఇవ్వండి అని వారు క్లియర్‌గా అడుగుతున్న ఉదంతాలు అనేకం వెలుగులోకి వస్తున్నాయి. అభ్యర్థి ఫేస్‌బుక్ అకౌంట్‌లోకి లాగిన్ అయ్యి అతడి వ్యక్తిత్వాన్ని సంపూర్ణ స్థాయిలో అర్థం చేసుకోవచ్చు అని కార్పొరేట్ కంపెనీలు భావిస్తున్నాయి. ఇది డెరైక్ట్ విధానం అయితే మరి కొన్ని కంపెనీలు ఉద్యోగుల వేటనే ఫేస్‌బుక్ ద్వారా ప్రారంభిస్తున్నాయి. కంపెనీల హెచ్‌ఆర్ డిపార్ట్‌మెంట్ వారు మారు పేర్లతో ఫేస్‌బుక్‌లోకి లాగిన్ అయ్యి తమకు నచ్చిన గుణాలున్న వారిని సెలెక్ట్ చేసుకొని ఉద్యోగాలు ఆఫర్ చేస్తున్నాయి అనే విషయాలు కూడా మీడియాలో వస్తున్నాయి.

No comments:

Post a Comment