Monday, June 25, 2012

saradaaga pc

ఫొటోషాప్ క్రాష్ అవుతోందా?


Adobe Photoshop 7, CS2 వంటి వెర్షన్లని ఉపయోగిస్తున్నప్పుడు ఒక్కోసారి అనేక సమస్యలు ఉత్పన్నం అవుతుంటాయి. ముఖ్యంగా ఫైల్ ని సేవ్ చేసేటప్పుడు ఒక్కసారిగా స్ర్కీన్ పై Kernel32 ఎర్రర్ మెసేజ్ చూపించబడి సిస్టమ్ మొత్తం ఫ్రీజ్ అయిపోతున్నట్లయితే సాధ్యమైనంత వరకూ తక్కువ అప్లికేషన్లు రన్ అవుతుండగా మాత్రమే ఫొటోషాప్ ని ఉపయోగించండి. RAM తక్కువగా ఉండి ఫొటోషాప్ తో పాటు PageMaker, InDesign, Acrobat వంటి ఇతర అడోబ్ ప్రోడక్టులు, MS-Office సాఫ్ట్ వేర్లు సైతం ఓపెన్ చేయబడి ఉన్నప్పుడు ఇలాంటి పరిస్థితి తలెత్తే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాంటప్పుడు ముఖ్యమైన అప్లికేషన్ ప్రోగ్రాములను మాత్రమే ఉంచుకుని మిగిలిన వాటిని క్లోజ్ చేసి ఫొటోషాప్ పై పనిచేయండి. అలాగే వేర్వేరు వెర్షన్ల ఫొటోషాప్ లను ఒకే సిస్టమ్ లో ఇన్ స్టాల్ చేసి వాడడం (ఉదా.కు.. ఓ వైపు ఫొటోషాప్ 7 ఉండగా, ఫొటోషాప్ CS2 వంటివి వాడడం), మీరు ఇన్ స్టాల్ చేసుకున్న ఫొటోషాప్ సాఫ్ట్ వేర్ లో ముఖ్యమైన ఫైళ్లు కరప్ట్ అవడం వల్ల, అడోబ్ షేర్డ్ ఫైళ్లు కరప్ట్ అవడం వల్ల, వేర్వేరు అడోబ్ ఉత్పత్తులు కామన్ ఫైళ్లని ఉపయోగించుకోవడంలో ఇబ్బందుల వల్ల కూడా ఇలా ఫొటోషాప్ క్రాష్ అయ్యే అవకాశం ఉంది. కారణం విశ్లేషించి తెలుసుకుని తగిన చర్యలు తీసుకోండి.

ఆదివారం 16 డిసెంబర్ 2007

లింకులు ఓపెన్ అవకుండా ఖాళీ బాక్స్ వస్తోందా?


ఇంటర్నెట్ బ్రౌజ్ చేస్తున్నప్పుడు ఏదైనా వెబ్ పేజీలోని లింక్ ని క్లిక్ చేసిన వెంటనే "ప్రస్తుతం ఉన్న పేజీ నుండి ఆ లింక్ ఉన్న పేజీ ఎలా లోడ్ చేయబడుతోంది" అని ఎప్పుడైనా ఆలోచించారా? సాధారణంగా Internet Explorer బ్రౌజర్ లో మనం లింకులను క్లిక్ చేసినప్పుడు ఆ లింకులు ఉన్న వెబ్ సైట్ అడ్రస్ ని టెంపరరీగా మెమరీలో భద్రపరుచుకుని IE విండోలోకి ఆ లింక్ యొక్క పేజీని ఓపెన్ చేయడానికి URLMON.DLL అనే ఫైల్ పనిచేస్తుంటుంది. ఈ ఫైల్ Windows\System ఫోల్డర్ లో స్టోర్ చేయబడి ఉంటుంది. ఒకవేళ ఈ ఫైల్ యొక్క రిఫరెన్స్ గనుక విండోస్ రిజిస్ట్రీలో మిస్ అయినట్లయితే ఇంటర్నెట్ ఎక్స్ ప్లోరల్ లో మనం ఏ లింక్ ని క్లిక్ చేసినా వెంటనే ఖాళీ విండో మాత్రమే ఓపెన్ చేయబడుతుంది. మీరూ ఇలాంటి సమస్యని ఎదుర్కొంటున్నట్లయితే Start>Run కమాండ్ బాక్స్ లో కానీ, DOS విండోలో కమాండ్ ప్రామ్ట్ వద్దకు గానీ వెళ్లి REGSVR32 URLMON.DLL అనే కమాండ్ ని టైప్ చేసి Enter బటన్ ప్రెస్ చేయండి. దీనితో రిజిస్ట్రీలో మిస్ అయిన ఈ ఫైల్ రిఫరెన్స్ మళ్లీ కొత్తగా సృష్టించబడి లింకులు సక్రమంగా పనిచేయనారంభిస్తాయి.

శనివారం 15 డిసెంబర్ 2007

బూటబుల్ సిడిలో ఏమీ కనిపించవు ఎందుకు?

98,Me బూటబుల్ ఫ్లాపీల ఆధారంగా బూటబుల్ సిడిలని క్రియేట్ చేసుకున్నప్పుడు ఫ్లాపీలో కనిపించే FDISK, FORMAT వంటి ప్రోగ్రాములు కూడ CDలో కనిపించవు. కానీ అవి పనిచేస్తుంటాయి. దీని వెనుక ఉన్న రహస్యం... బూటబుల్ ఫ్లాపీ ఆధారంగా సిడి క్రియేట్ చేయబడేటప్పుడు ఫ్లాపీలోని అన్ని ఫైళ్ళూ BOOTIMG.BIN అనే ఫైల్‌లో ప్యాక్ చేయబడతాయి. దీనితోపాటు BOOTCAT>BIN అనే మరో కేటలాగ్ ఫైల్ బూటబుల్ సిడిలో సృష్టించబడుతుంది. సో... బూటింగ్‌కి సంబంధించిన సకల సమాచారం ఈ రెండు ఫైళ్ళలోనే అంతర్గతంగా ఉండడం వల్ల Windows Explorer ద్వారా చూసినప్పుడు Format, Fdisk వంటి ఫైళ్ళు విడిగా కనిపించవు.

బుధవారం 5 డిసెంబర్ 2007

XPS ఫార్మేట్ గురించి తెలుసా?


XML Paper Specification అనే ఫార్మేట్ ని క్లుప్తంగా XPS అంటారు. ఇది మైక్రోసాఫ్ట్ అభివృద్ధి పరిచిన XML ఆధారిత డాక్యుమెంట్ ఫార్మేట్. ఇప్పటివరకూ Enhanced Metafile (EMF)గా వాడుకలో ఉన్న ఫార్మేట్ స్థానంలో ఈ కొత్త ఫార్మేట్ ని మైక్రోసాఫ్ట్ సంస్థ ప్రవేశపెట్టింది. మనం ఫొటోషాప్, వర్డ్, ఎక్సెస్ వంటి వివిధ రకాల ప్రోగ్రాములతో అనేక డాక్యుమెంట్లని డిజైన్ చేస్తుంటాం. అయితే ఆయా ఫైళ్లని ఓపెన్ చేయాలన్నా, ప్రింట్ తీయాలన్నా దాని ఒరిజినల్ అప్లికేషన్ కావలసిందే కదా! అయితే XPS ఫార్మేట్ కి చెందిన డాక్యుమెంట్లని ఓపెన్ చేయాలన్నా, ప్రింట్ తీయాలన్నా అవి ఏ అప్లికేషన్ తో క్రియేట్ చేయబడ్డాయో ఆ అప్లికేషన్ ని మన సిస్టంలో ఇన్ స్టాల్ చేయనవసరం లేదు. Microsoft XPS Document Writer సాయంతో క్రియేట్ చేసుకున్న XPS డాక్యుమెంట్లని ఏ థర్డ్ పార్టీ సాఫ్ట్ వేర్ అవసరం లేకుండానే నేరుగా ఓపెన్ చేసుకోవచ్చు. Windows, Mac, Solaris, Unix వంటి వేర్వేరు ఆపరేటింగ్ సిస్టం ల మధ్య సమాచారాన్ని బదిలీ చేయడానికి ఈ ఫార్మేట్ ఉపయుక్తంగా ఉంటుంది. భవిష్యత్లో విడుదల చేయబడే అన్ని ప్రింటర్లూ XPS ఫార్మేట్ ని సపోర్ట్ చేసేవిగా రూపొందించబడతాయి. Windows Vista ఆపరేటింగ్ సిస్టంలో XPS Viewer ప్రోగ్రాం ఆల్రెడీ పొందుపరచబడి ఉంటుంది. Windows XP, Server 2003 లకు ఇది కావాలంటే http://download.microsoft.com/download/4/d/a/4da3a5fa-ee6a-42b8-8bfa-ea5c4a458a7d/dotnetfx3setup.exe అనే లింకు ద్వారా డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

No comments:

Post a Comment